||సుందరకాండ ||

||తత్త్వదీపిక - ఐదవ సర్గ ||

||తత్త్వ దీపిక: హనుమంతుని అన్వేషణ ||


||ఓం తత్ సత్||

సుందరకాండ.
అథ పంచమ స్సర్గః

తత్త్వదీపిక : హనుమంతుని అన్వేషణ

ఐదవ సర్గలో జరిగినది చెప్పాలి అంటే అది అంతా హనుమంతుని అన్వేషణ గురించి.

లంకానగరములో హనుమంతుడు శ్రియముతో కూడిన వారిని , మత్తెక్కిన వారిని ,
పరస్పరము ఆక్షేపించుకొనుచున్నవారిని చూచెను.
అలాగే చూసిన కాంతలలో చందనానులేపనము చేసినవారు,
నిద్రించుచున్నవారు, భర్తతో నిద్రిస్తున్న పతివ్రతలు,
మంచి రూపము ముఖము కలవారు, నవ్వుతూ ఉన్నవారు, కోపముతో ఉన్నవారు,
నిట్టూర్పులు విడుస్తున్నవారు అనేక మందిని చూచెను.
దీర్ఘనిశ్వాసములు విడుస్తున్న వీరులతో నిండిన ఆ నగరము
బుసలు కొట్టుచున్న సర్పములు కల నగరము లాగా వెలుగుచుండెను.
హనుమంతుడు అక్కడ చాలామంది స్త్రీలను చూచెను.
కాని రాజకులములో పుట్టి ధర్మమార్గములో పెరిగినది ,
కోమలమైన శరీరముగల, సీతాదేవిని మాత్రము చూడలేదు.
రాముని భార్యని చాలాకాలము వెదికినప్పటికీ కానక
ఆ పవనాత్మజుడు దుఃఖముతో కొంతకాలము నిరాశానిశ్పృహలకు లోనయ్యెను.
ఇది జరిగిన కథ.

మొదటి సర్గలోని మొదటి శ్లోకములో విన్నది
సుందరకాండలో సీతాన్వేషణే ముముక్షువులయొక్క ఆత్మాన్వేషణ అని.
అదే సుందరకాండలో అంతరార్ధము అని కూడా విన్నాము.

అ విధముగా అంటే ఆత్మాన్వేషణ అనే భావము తో చూస్తే
ఈ సర్గలో చూడవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.

అవి ముఖ్యముగా మూడు.

మూడవ సర్గ చివరి శ్లోకములో
చంద్రుడు హనుమంతుని సీతాఅన్వేషణలో
హనుమంతునికి సాచివ్యము చేద్దామా అన్నట్లు ఉదయించినట్లు చెప్పడమైనది.

ఈ సర్గలో ఆ చంద్రవర్ణన అనేక విధములుగా చెప్పబడినది.

1 చంద్రవర్ణన చేస్తూ ఒక శోకములో చంద్రుని "భగవాన్ శశాంకః" అని అంటాడు వాల్మీకి.
అలాగే ఇంకో శ్లోకములో " భగవాన్ ప్రదోషః" అని రాత్రికి భగవాన్ అనే పదము వాడడము అయింది.

అంటే సీతాన్వేషణకు సాయ పడేటట్టుగా చంద్ర కిరణాలతో కాంతి విరజిల్లి సాయపడుతున్నచంద్రుడు "భగవానుడు".

ఏ జ్ఞానము భగవంతుని ఆత్మను గోచరింపచేయునో ఆ జ్ఞానము పవిత్రము.
ఏ జ్ఞానము లౌకిక విషయములను ప్రదర్శించు నో ఆ జ్ఞానము అజ్ఞానము హీనమైనది.
ఇక్కడ సీతాన్వేషణకి సాయపడు చంద్రుడు "భగవానుడు".

అలాగే ఏ రాత్రి ఏ జన్మము ఆత్మాన్వేషణకు ఉపయోగపడునో,
ఆ రాత్రి ఆ జన్మము " భగవత్ స్వరూపము".
ఆ రాత్రి పూజ్యము.

2 సుండరకాండలో మూడు భాగములు వున్నాయి.

- అన్వేషణము
- దర్శనము
- విరోధి నిరసము

హనుమ సీతమ్మను వెదుకును, దర్శించును.
అమెకు విరోధులైన వారిని హతమార్చును.

అదేవిధముగా జీవుడు ఆత్మను వెదుకును, దర్శించును.
ఆత్మనిరోధులగు పాపములను నశింపచేయును.

ఉపనిషత్తులలో ఒక మాట చెప్పబడినది.
" సో అన్వేష్టవ్యః" -
అంటే "సః అన్వేష్టవ్యః" -
అంటే " అతడు అన్వేషింపతగినవాడు"
ఏవడు? ఆ భగవంతుడు అన్వేషింప తగిన వాడు.
అంటే పరమాత్మగురించి అన్వేషింపవలెను అని.
అలాగే , ఆత్మ కూడా "అన్వేష్టవ్యః" అంటే అన్వేషింప తగినది.

ఈ అన్వేషణలో హనుమంతుడు ముఖములు నేత్రములు ఆభరణములను చూస్తూ ఉన్నట్లుచెప్పడమైనది.
భగవత్ప్రాప్తికి యోగ్యులగువారి ముఖములో సౌమ్యత కనపడును.
సౌమ్యత ఉన్నప్పుడే అవగాహన ఎక్కువ అవుతుంది.
అత్మాన్వేషణ కుదురుతుంది.

కన్నులయందు భగవద్విషయము వినినప్పుడు వికసించుట కనపడును.
కన్ను జ్ఞానమునకు సూచకము.
ఆ జ్ఞానము భవద్విషయకమై ఉన్నపుడు - అదే కంటికి అందము.
ఈ శరీరానికి ఆభరణాలు శమదమాది గుణములు

ఈ మూడూ సౌమ్యత, భవద్విషయకమైన జ్ఞానము, శమ దమాది గుణములు ఉన్నవారే
ముముక్షువులుగా గురువులచేత స్వీకరింపబడతారు.

3 ఈ సర్గలో చివరి వాక్యములో
"పవనాత్మజుడు దుఃఖముతో కొంతకాలము నిరాశానిశ్పృహలకు లోనయ్యెను" అని వింటాము

హనుమ అన్వేషించుటలో అందమైన సన్నివేశములు ఎన్నిటినో చూసెను.
కాని అతని మనస్సుకి సుఖము కలగలేదు.
చివరికి ఆ సీత కనపడక పోవడముతో దుఃఖమే కలిగెను.

ఆత్మాన్వేషణలో కూడా అందమైన అనుభూతులను పొందిననూ,
ఆ ఆత్మాన్వేషణలో వున్నవారు ఆనందములతో ఆగిపోరు.
అత్మదర్శనము కాలేదే అని దుఃఖించుచుందురు.
అదే హనుమంతుని దుఃఖము కూడా.

||ఓమ్ తత్ సత్||
|| ఇవి శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీత ద్వారా మాకు తెలిసిన మాటలు||
||ఓమ్ తత్ సత్||